నోటీసుల కలవరం! | - | Sakshi
Sakshi News home page

నోటీసుల కలవరం!

Aug 27 2026 1:06 AM | Updated on Aug 27 2026 1:06 AM

గ్రామసభలే కీలకం

ముసాయిదా ఓటరు జాబితాలో పేరున్నా జారీ

ఎవరెవరు?

పకడ్బందీగా ఏర్పాట్లు..

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్ల

ఆందోళన

తగిన గుర్తింపు కార్డు చూపిస్తేనే

అర్హులుగా గుర్తింపు

నేడు జిల్లావ్యాప్తంగా గ్రామ/వార్డు సభలు

అచ్చంపేట: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఇటీవల ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. అందులో చాలా మంది తమ పేర్లు కనిపించడం లేదు. మరికొందరి పేర్లు ఉన్నప్పటికీ.. వివరాలు సరిగ్గా లేవని, అన్‌మ్యాపింగ్‌ కాలేదని నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే సరైన స్పష్టత లేకుండా చాలా మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/వార్డు సభలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌ కల్వకుర్తి నియోజకవర్గాల్లో 8,35,482 (85.52 శాతం) మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రకటించగా.. అందులో అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లు 1,81,115 మంది ఉన్నట్లు తేలింది. వీరు సరైన పత్రాలు చూపిస్తేనే తుది జాబితాలో స్థానం దక్కుతుంది.

1.81లక్షల మందికి నోటీసులు..

గత జూన్‌లో ఎన్నికల సంఘం ప్రకటించిన జిల్లా ఓటర్ల జాబితాలో 9,76,987 మంది ఉన్నారు. అదే నెల 25 నుంచి ప్రారంభమైన ఎస్‌ఆర్‌ ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. అందులో 8,35,482 మందికి స్థానం దక్కగా.. మరో 1,41,505 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే గాక, ఫారం తీసుకోని వారు, తీసుకున్నా ఇవ్వనివారు ఉన్నారు. అయితే ముసాయిదా జాబితాలోని 1,65,552 మందికి సంబంధించి పేర్లలో అక్షర దోషాలు, చిరునామా, ఫొటోలు తప్పుగా ఉండి, మ్యాపింగ్‌ వివరాల్లో వ్యత్యాసం రావడంతో అనామలీస్‌ జాబితాలో చేర్చారు. మరో 43,131 మంది వివరాలు 2002 ఓటరు జాబితాతో పోల్చినప్పుడు వివరాలు లేక మ్యాపింగ్‌ కాలేదు. వారందరికీ బీఎల్‌ఓల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. మరికొందరికి సెల్‌ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపిస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈఆర్వో, ఏఈఆర్వో వద్దకు వెళ్లి ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైన ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.

సర్‌ ప్రక్రియలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామ/వార్డు సభలు కీలకం కానున్నాయి. ఈ సభల్లో ఈ నెల 17న ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలను పోలింగ్‌ కేంద్రాల వారీగా చదివి వినిపిస్తారు. జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరును తుది జాబితాలో ఉండేలా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు గ్రామ/వార్డు సభ వేదిక కానుంది. ప్రజల సమక్షంలో పేర్లను చదివే అవకాశం ఉండటంతో ఎక్కడైనా ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్న ఓటర్లు స్థానికంగానే ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వెంటనే వారిని గుర్తిస్తారు. బోగస్‌ ఓట్లు, తదితర అభ్యంతరాలు వస్తే వాటిని నమోదు చేసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి వివరాలను సేకరిస్తారు. ఈ సభల్లో ఫారాలు–6, 7, 8 అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు.. ముసాయిదా జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు తెలిపేందుకు.. పేర్లు, చిరునామాలు వంటి వాటిలో తేడాలు, అక్షర దోషాలు ఉంటే మార్పులు, చేర్పులకు వీటిని ఉపయోగిస్తారు.

జిల్లాలో గత జాబితా ప్రకారం

మొత్తం ఓటర్లు: 9,76,987

ముసాయిదా జాబితా : 8,35,482

అనామలీస్‌ ఓటర్ల సంఖ్య: 1,65,552

తొలగించిన ఓటర్లు 1,41,525

మ్యాపింగ్‌ కాని వారు 43,131

ముసాయిదా జాబితాలో పేర్లు ఉన్నాయా.. లేదా అని జిల్లావాసులు కొందరు నేరుగా, మరికొందరు ఆన్‌లైన్‌లో చూసుకుంటున్నారు. అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండటంతో చివరి వరకు కొనసాగుతాయా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదా విడుదలైతే ఓటు హక్కు ఉన్నట్టేనని ఇన్నాళ్లు భావించగా.. ఒక్కసారిగా నోటీసులు రాగానే అవాక్కయ్యారు. అనామలిస్‌, మ్యాపింగ్‌ కాని వారికి కూడా జాబితాలో చేర్చడంతో ఈ పరిస్థితి ఎదురువుతోంది.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు, గ్రామ సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ముసాయిదా ఓటరు జాబితాను చదివి వినిపిస్తారు. ఈ సభలోనే తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడిస్తారు. అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు సంబంధించిన వివరాలను బీఎల్‌ఓల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిస్తారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరును తుది జాబితాలో ఉండేలా చూసేందుకు గ్రామ/వార్డు సభలు వేదికగా ఉపయోగపడుతాయి.

– హేమంత కేశవ్‌ పాటిల్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement