పర్యాటక సందడి | - | Sakshi
Sakshi News home page

పర్యాటక సందడి

Aug 27 2026 1:06 AM | Updated on Aug 27 2026 1:06 AM

కృష్ణా తీరానికి పెరిగిన

సందర్శకుల తాకిడి

బోటింగ్‌ చార్జీలు ఇలా..

సోమశిల వ్యూ పాయింట్‌కు సైతం బారులు..

సోమశిలలో బోటు షికారికి

పర్యాటకుల ఆసక్తి

ఏడు రకాల బోట్లను అందుబాటులో ఉంచిన టూరిజంశాఖ

బోటింగ్‌ సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

కొల్లాపూర్‌: శ్రీశైలం జలాశయానికి వరద జలాలు రావడంతో కృష్ణానది కళకళలాడుతోంది. నదీ తీర ప్రాంతాల్లో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు, టూరిజంశాఖ ఏర్పాటుచేసిన బోట్లలో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించిన సోమశిల వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు బారులు తీరుతున్నారు. రెండు, మూడు వారాలుగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది.

నదీ తీర ప్రాంతాల్లో ఇలా..

శ్రీశైలానికి వరద జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో సోమశిల వద్ద పర్యాటక బోట్ల సేవలను ఇటీవలే ప్రారంభించారు. ఏడు రకాల బోట్లు పర్యాటకులు విహరించేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే టికెట్ల బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌ సేవలను ఇంకా ప్రారంభించలేదు. ఆఫ్‌లైన్‌లోనే టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నదిలో బోటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్‌ ప్రాంతాలను కూడా పర్యాటకులు తిలకిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కొరవడిన నిఘా..

కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల సోమశిలలో కొందరు పర్యాటకులు అర్ధరాత్రి సమయంలో బోటింగ్‌ సిబ్బందిపై దాడి చేశారు. రాజకీయ నాయకుల జోక్యంతో దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసులు నమోదుచేసి వదిలిపెట్టారు. దీంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించేందుకు పకడ్బందీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్‌ వంటి ప్రాంతాల్లో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్పీడ్‌ బోట్‌: ఒక్క ట్రిప్పు రూ.400 చార్జీ ఉంటుంది. నలుగురు వ్యక్తులు తిరగొచ్చు. అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. అదనపు వ్యక్తులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

మినీ లాంచీ : ఇందులో 60మంది వరకు ప్రయాణించవచ్చు. పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చార్జీ వసూలు చేస్తున్నారు.

జెట్‌స్కీ బోట్‌ : ఒక వ్యక్తి మాత్రమే దీనిపై రైడ్‌ చేయవచ్చు. టికెట్‌ చార్జీ రూ.500 ఉంటుంది.

ఫనీయాక్‌ : ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.200 టికెట్‌ చార్జీ.

పెడల్‌ బోట్‌ : ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.

కై యాక్‌ బోట్‌ : ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణిస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.150 టికెట్‌ చార్జీ.

స్వాన్‌బోట్‌ : ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.150 టికెట్‌ చార్జీ.

వ్యూ పాయింట్‌ తిలకించేందుకు ఒక్క ట్రిప్పు రూ.800 ధర నిర్ణయించారు. వాహనంలో 4 నుంచి 6 మంది వరకు వెళ్లొచ్చు. ప్రయాణ సమయం 40 నిమిషాలు. రెండు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షించవచ్చు.

అటవీశాఖ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌ సమీపంలో ఎకో పార్కు నిర్మించారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలో నల్లమల అడవిలో ఎత్తయిన కొండపై వ్యూ పాయింట్‌ ఏర్పాటుచేశారు. ఇక్కడినుంచి చూస్తే సోమశిల గ్రామంతో పాటు కృష్ణానది ప్రవాహం, నల్లమల పచ్చదనం కంటికి ఇంపుగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్‌ సేవలను గతనెల 8న రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. నాటి నుంచి వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు కూడా పర్యాటకులు వస్తున్నారు. వారి కోసం అటవీశాఖ అధికారులు రెండు వాహనాలను ఏర్పాటుచేశారు. టికెట్‌ బుకింగ్‌ ఆఫ్‌లైన్‌లోనే కొనసాగుతోంది. పర్యాటకులకు నల్లమల అందాలను చూపించేందుకు సోమశిల నుంచి అమరగిరి వరకు నూతనంగా మట్టిరోడ్డు నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement