సిబ్బందిని నియమించాల్సి ఉంది..
● గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి రాని డిజిటల్ సేవలు
● ఆపరేటర్లు లేక నిరుపయోగంగా
పరికరాలు
కల్వకుర్తి రూరల్: గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలు అటకెక్కాయి. టీ ఫైబర్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. జీపీల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయకపోవడం, ఆపరేటర్లను నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. క్లస్టర్ పంచాయతీ కార్యాలయాల్లో సర్వర్ ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
ఆపరేటర్లు లేక ఇబ్బందులు..
జిల్లాలో 454 గ్రామ పంచాయతీలు ఉండగా.. 9 క్లస్టర్ గ్రామాల్లో సర్వర్లు, ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేశారు. చాలా వరకు వాటిని వినియోగించడం లేదు. దీంతో కార్యదర్శులు ఏ పని అవసరమున్నా మండల కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీడీఓ కార్యాలయంలో ఈ పంచాయతీ ఆపరేటర్లు ఉండటంతో వారి ద్వారా కార్యదర్శులు ఆన్‌లైన్ పనులు చేయించుకుంటున్నారు. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఆపరేటర్లు మాత్రమే ఉండటంతో పనిభారం పెరిగి.. సరైన సమయంలో పనులు కావడం లేదు. కాగా, కొన్ని క్లస్టర్లలో ఉండాల్సిన కంప్యూటర్లను ఎంపీడీఓ, ఉపాధి హామీ కార్యాలయాలలో వినియోగిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోని క్లస్టర్ గ్రామాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఆపరేటర్లను నియమించలేదు. కేవలం 60 మంది ఆపరేటర్లు మాత్రమే ఉండటంతో వారంతా ఆయా మండలాల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేవు. మండల పరిషత్ కార్యాలయంలోనే పనులు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తాం.
– శ్రీరాములు, డీపీఓ


