అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రం నాటికి 874.70 అడుగులు (162.0554 టీఎంసీలు)గా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ.. 14,359 క్యూసెక్యుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం 164.7532 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారుగా 2 టీఎంసీల నీటిమట్టం తగ్గింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 14.663 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం నీటిని తరలిస్తున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 8వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.
170.477 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 170.477 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 14 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు.


