నాగర్‌కర్నూల్: విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుంది. గృహ వినియోగమే కాకుండా వ్యవసాయ వాడకం సైతం అధికమైంది. వీటికితోడు చిన్న, పెద్ద పరిశ్రమలు పుట్టుకొస్తుండటంతో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగిపోయి.. నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి సబ్‌స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటికే 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 107 ఉండగా.. అదనంగా మరో 39 స్టేషన్ల నిర్మాణం చేపడుతోంది. ఇవేకాక ఇవేకాక 132/33, 220/132 సబ్ స్టేషన్లు నిర్మించాలన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నారు.
220/132 నిర్మాణంలో జాప్యం
మరికల్ వద్ద చేపట్టిన 220/132 విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇది ప్రారంభమైతే వనపర్తి, జడ్చర్లలోని కొన్ని గ్రామాలు, లట్టుపల్లి, మంగనూరు తదితర గ్రామాలకు విద్యుత్ సమస్య తీరుతుంది. ప్రస్తుతం లట్టుపల్లి, మంగనూరు చుట్టుపక్కల గ్రామాలు, రైతులు విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నారు. నాలుగైదు నెలల్లో పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో 220/33 సబ్‌స్టేషన్ అమ్రాబాద్‌కు మంజూరు చేయగా.. టెండర్ పిలవాల్సి ఉంది.
● వంగూరు మండలం పోల్కంపల్లి వద్ద 132/33 సబ్‌స్టేషన్ మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఈ విద్యుత్ స్టేషన్‌తో వెల్దండ, చారకొండ మండలాలతోపాటు రెండు రెవెన్యూ డివిజన్లలో విద్యుత్ సమస్య చాలా వరకు తీర్చవచ్చని అధికారులు చెబుతున్నారు.
గతంలో మంజూరైనవి కలిపి..
జిల్లాలో ప్రస్తుతం 107 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉండగా.. వీటికి తోడుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా 39 నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3– 3.50 కోట్ల వరకు వెచ్చిస్తుండగా.. 39 స్టేషన్లకు గాను రూ.130 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మూడు మాత్రం పదేళ్ల కిందట మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. వెల్దండ మండలంలోని పోతేపల్లి, కొల్లాపూర్ పరిధిలోని మంచాలకట్ట, పెంట్లవెల్లి గ్రామాల్లో మంజూరైన సబ్‌స్టేషన్ల నిర్మాణంలో వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వీటిపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించి పనులు వేగవంతం చేస్తున్నారు. త్వరలో ప్రారంభించాలన్న లక్ష్యంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఇవే కాక జిల్లాలోని వివిధ మండలాల్లో 36 సబ్‌స్టేషన్లు కొత్తగా మంజూరయ్యాయి. కొన్ని టెండర్ దశలో, మరికొన్ని వివిధ దశల్లో పనులు నడుస్తున్నాయి. వీటి పనుల్లోనూ వేగం పెంచి పూర్తిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
రాబోయే ఐదేళ్ల డిమాండ్
అంచనా వేసి కొత్తగా మంజూరు
జిల్లాలో కొత్తగా 39 33/ 11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం
రూ.130 కోట్లకుపైగా వ్యయంతో ముమ్మరంగా పనులు


