కందనూలు: లాభదాయక పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. నీట్ పీజీ 2026 పరీక్ష నిర్వహణ, పర్యాటక అభివృద్ధి, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, వ్యవసాయ తదితర అంశాలపై మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్ చెన్నయ్య, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ప్రస్తుత వాతావరణం, నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఆయిల్‌పాం, మొక్కజొన్న, బిందు సేద్యం ద్వారా కూరగాయలు, ఇతర లాభదాయకమైన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా మార్కెట్ డిమాండ్, నీటి లభ్యత, పంటల ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సోమశిల, మన్ననూరు ఎకో టూరిజం, పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ పాండు, జ్ఞానశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నవోదయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ..
నాగర్‌కర్నూల్: జవహర్ నవోదయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నవోదయ అడ్వైజరీ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలపై చర్చించగా.. ప్రిన్సిపల్ పూర్ణిమ పాఠశాలలోని ప్రస్తుత పరిస్థితులను కమిటీకి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నవోదయ విద్యాలయానికి అవసరమైన వనరులు, మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందాలని సూచించారు. ఆమోదం పొందిన ప్రతిపాదనల మేరకు జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, నవోదయ వైస్ ప్రిన్సిపల్ సుధారాణి, ఆఫీస్ సూపరింటెండెంట్ మాణిక్‌ప్రభు, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


