కందనూలు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని, రాబోయే తరాలకు మంచి పర్యావరణం అందించడానికి, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో మనం తీసుకునే ప్రతి అడుగు ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఓ కృష్ణయ్య, సీఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో 875.20 అడుగుల నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 875.20 అడుగుల 164.7532 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 11,500 క్యూసెక్యుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. అయితే సోమవారం ఉదయం 166.7052 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వదలడంతో ఒక టీఎంసీ మేర తగ్గింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్‌కు 31,364 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలు, సాగునీటి పథకాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్‌ఐ ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.


