లింగాల: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం లింగాలలోని ఎస్టీ బాలుర వసతి గృహం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, అప్పాయపల్లి, క్యాంపు రాయవరం ఆశ్రమ పాఠశాలలను డీటీడీఓ ఆకస్మిక తనిఖీ చేసి.. ఆయా పాఠశాలల స్థితిగతులు, నిర్వహణ, అన్ని రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న అల్పాహారం, భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన హెచ్‌డబ్ల్యూలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెనూ పాటిస్తూ, నాణ్యమైన భోజనం, తాజా కూరగాయలు అందించాలని చెప్పారు. వసతి గృహాలలో ఎంత మంది వర్కర్లు పని చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు.


