ఖాళీల భర్తీ ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

ఖాళీల భర్తీ ఎప్పుడో..?

Aug 25 2026 1:15 AM | Updated on Aug 25 2026 1:15 AM

కందనూలు: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, నోటిఫికేషన్‌లో జారీ మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసి నియామక ప్రక్రియ చేపడుతున్నారు. కానీ, జిల్లాలో ఖాళీ పోస్టులను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించినా ఇప్పటికీ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. దీంతో టీచర్‌, సహాయకులు లేని అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది.

అందని పౌష్టికాహారం..

అంగన్‌వాడీ కేంద్రాల్లో కొన్ని సంవత్సరాలుగా టీచర్లు, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండటంతో లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. చిన్నారులు ఆటపాటలు, బోధనకు దూరమవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో టీచర్లు లేక సహాయకులు పిల్లలకు భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సహాయకుల పోస్టులు సంవత్సరాల తరబడి భర్తీ చేయకపోవడంతో వారి విధుల్ని సైతం టీచర్లే నిర్వహించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారం అందక ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

టీచర్లు, ఆయాలదే కీలకపాత్ర..

జిల్లాలో అంగన్‌వాడీ నిర్వహణ పూర్తిగా జిల్లా మహిళా, శిశు సక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందులో భాగంగా జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో 1,132 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 171 టీచర్‌ పోస్టులు, 558 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో వీరే కీలకపాత్ర వహిస్తున్నారు. వీరు అంగన్‌వాడీల నిర్వహణతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ కార్యక్రమాలు, బూత్‌ లెవల్‌ అధికారులుగా ఎన్నికల విధుల్లోనూ సేవలందిస్తారు. ఈ విధంగా వారికి పలు రకాల విధులు కేటాయించడంతో వారిపై పనిభారం ఎక్కువై ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా పోస్టులు భర్తీ చేసినట్లయితే తమకు పనిభారం తగ్గి.. సేవలు మెరుగుపడుతాయని వారు భావిస్తున్నారు.

జిల్లా పరిధిలో ఇలా..

జిల్లాలో ఖాళీగా టీచర్‌, ఆయా పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయనుండగా ఆశావహులు నోటిఫికేషన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో పదో తరగతి చదివినవారికి ఆంగన్‌వాడీ పోస్టులు ఇవ్వగా.. ప్రస్తుతం విద్యార్హత ఇంటర్మీడియట్‌ పెంచారు. ఆయాలకు పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. ఇంటర్‌ చదివి స్థానికంగా నివాసం ఉండే అర్హులైన మహిళలను టీచర్‌గా నియమించనున్నారు. గతంలో మాదిరిగానే కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇంటర్‌లో సాధించిన మార్కులకు మెరిట్‌ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపట్టనుండగా నోటిఫికేషన్‌ వస్తే దరఖాస్తు చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.

జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల కోసం నిరీక్షణ

నోటిఫికేషన్‌ విడుదలలో తీవ్ర జాప్యం

జిల్లావ్యాప్తంగా 171 టీచర్‌, 558 సహాయకుల పోస్టులు

భర్తీ కోసం అశావహుల ఎదురుచూపులు

ఉమ్మడి పాలమూరులో మిగతా చోట్ల మొదలైన ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement