అచ్చంపేట/ బల్మూర్/ పెంట్లవెల్లి: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో జాతీయ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71 కోట్ల అంచనాతో చేపట్టనున్న 3 రహదారి అభివృద్ధి పనులకు బల్మూర్‌లో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులు, నాలుగు లేన్ల రోడ్లు, ఎలివేటేడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్, రావిర్యాల నుంచి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. బుల్లెట్ ట్రైన్ హబ్‌గా ఉంటే శంషాబాద్ వద్ద 500 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. శంషాబాద్, ఫ్యూచర్ సిటీ మీదుగా బెంగుళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు నల్లమల మీదుగా కర్నూలు వెళ్తుందన్నారు. రాత్రివేళ ఫారెస్టులో ప్రయాణం చేసే అవకాశం లేక శ్రీశైలంలో నైట్ ఎక్కువగా ఉండరని, ఘాట్ రోడ్డులో ఇబ్బందులు పోవాలంటే కారిడార్ నిర్మాణం జరగాలన్నారు. ఈ ప్రాజెక్టుతో నల్లమల ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి.. పర్యాటరం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఆర్‌బీఐ గ్యారంటీ ద్వారా బ్యాంక్ లోన్ తీసుకొని రూ.7,200 కోట్లతో ప్లాన్, నాన్– ప్టాన్ కింద రోడ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. రోడ్లు బాగుంటేనే ప్రయాణికులు ఇంటికి క్షేమంగా వెళ్తారని, మారుమూల ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉంటే పరిశ్రమలు వచ్చి.. యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
ఆరు వరుసలతో శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్
అచ్చంపేట అభివృద్ధికి నిధులు ఇస్తాం
రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పాల్గొన్న మంత్రి జూపల్లి,ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ


