నాగర్‌కర్నూల్/ కందనూలు: జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం సర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఆయన వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గురువారం అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనామలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్‌లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నోటీసులు అందించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామన్నారు. గురువారం నిర్వహించే గ్రామసభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు. సభల నిర్వహణ వివరాలను సక్రమంగా డాక్యుమెంటేషన్ చేసి, సభల ఫొటోలను బీఎల్‌ఓ రిజిస్టర్‌లో భద్రపరచాలని స్పష్టం చేశారు.


