రెవెన్యూ లీలలెన్నో! | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ లీలలెన్నో!

Aug 23 2026 1:46 AM | Updated on Aug 23 2026 1:46 AM

ఎన్‌ఓసీ ఇచ్చింది వారే.. 22–ఏలోకి చేర్చింది వారే!

ప్రభుత్వ భూములు పక్కదారి.. ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలోకి..

రిజిస్ట్రేషన్‌ కాక లబోదిబోమంటున్న యజమానులు

జిల్లాలో వెలుగులోకి పలు సర్వే నంబర్లు

అచ్చంపేట: రెవెన్యూ అధికారుల నిర్వాహకంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలైన ప్రభుత్వ భూములను వదిలేసి.. ప్రైవేటు ప్లాట్లు, నివాసగృహాలను ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆందోళన చెందుతున్నారు. డబ్బులు అవసరం ఉండి.. ప్లాట్లు, ఇతర భూములను అమ్ముకోవడానికి వెళ్తే.. రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా వృథా అవుతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో రెవెన్యూ అధికారులు నిషేధిత ప్రభుత్వ ఆస్తులు, భూముల జాబితా 22–ఏను అప్‌డేట్‌ చేశారు. ఈ క్రమంలో అధికారులు ఇష్టానుసారంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో యజమానులకు కష్టాలు మొదలయ్యాయి. కొందరు అధికారులు చేసిన తప్పిదాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

స్లాట్‌ బుక్‌ కావడం లేదు..

మాకు అచ్చంపేటలోని సర్వేనం. 301/అ, 294/అ2, 294/అఇ, 294/అ/2/ఇలోని వెంచర్‌లో 5, 6 జాయింట్‌ ప్లాట్లలో మొత్తం 308 గజాల స్థలం ఉంది. ఇందులో 5వ నంబర్‌ ప్లాట్‌ను మూడు నెలల క్రితం ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేశాం. ఇప్పుడు 6వ నంబర్‌ ప్లాట్‌ను అమ్ముకున్నాం. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు స్లాట్‌ బుక్‌ కావడం లేదు. ఈ విషయం అచ్చంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ దృష్టికి తీసికెళ్లాం. 22ఏ నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌తో పాటు దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్‌ పంపిస్తామంటే దరఖాస్తు చేశాం. ఇంత వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. రెండు నెలల్లోనే మా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఇంత తేడా కనిపించింది.

– వెన్నమనేని ప్రణిత, హైదరాబాద్‌

ముందుగా వివరాలు తెలుసుకోవాలి..

మా దృష్టికి వచ్చిన సర్వేనంబర్లను ఇప్పటికే రెండు పర్యాయాలు కలెక్టర్‌కు పంపించాం. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే క్రయ, విక్రయదారులు స్లాట్‌ బుక్‌ చేసుకోవద్దు. ముందుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని సంప్రదించి, వివరాలు తెలుసుకున్న తర్వాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఎవరు కూడా డబ్బు వృథా చేసుకోవద్దు. ప్రభుత్వం త్వరలోనే సమస్య పరిష్కరిస్తుంది.

– క్రిష్టఫర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, అచ్చంపేట

నిలిచిన రిజిస్ట్రేషన్లు..

అచ్చంపేట పట్టణానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఫారం–2లో నాన్‌ అగ్రికల్చర్‌ కింద రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని సెక్షన్‌ 22ఏ (1) (బి) ద్వారా సుమారు 15 సర్వే నంబర్లలో 45.28 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొన్నారు. ఇవి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలు, ఆరోగ్య కేంద్రం, శ్మశాన స్థలం మొదలైన ఉపయోగాల కోసం చూపబడ్డాయి. సర్వేనంబర్ల వారీగా 283అ5, 284, 285, 294, 326అ/2, 344అ/1/1ఆ, 353/అ1,353/అ2, 353అ2, 362/అ1/2, 369, 370, 371, 373అ, 373ఈ ఉన్నాయి. అయితే 169, 237, 301/అ, 285, 294, 294/అ2, 294/ఆఇ, 294/ఆ/2/ఇ, 353/అ1, 353అ2, లింగాల 2,17, టంగాపూర్‌ 30, లింగోటం 240 సర్వే నంబర్లలో నివాస గృహాలు, ప్లాట్లు ఉండగా.. వీటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. గతంలో ఈ భూములకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుని ఎన్‌ఓసీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్‌ఓసీల ఆధారంగా వెంచర్ల అనుమతులు పొంది.. రియల్‌ వ్యాపారులు ప్లాట్లను అమ్ముకున్నారు. అయితే ఎన్‌ఓసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులే ఇప్పుడు ఈ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు లబోదిబోమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement