కొల్లాపూర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించి అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హులైన వారు ఈ నెల 27వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 92900 86457, 99638 68115 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్టాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణమాసం శుక్లపక్షం జేష్ట మూలనక్షత్రం సందర్భంగా ఆలయ పూజారి గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరమశివుడిని దర్శించుకుని.. రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు.
జూరాలకు 52వేల క్యూసెక్కుల వరద
గద్వాల/అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శనివారం 52వేల క్యూసెక్కుల వరద న మోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.567 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 318.46 మీటర్లు (9.542 టీఎంలు) నీరు ఉంది. హైడల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి 37,394 క్యూసెక్కులు, భీమా–1కు 1,300, భీమా–2కు 872, కోయిల్‌సాగర్‌కు 630, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 585, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 49,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
● శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం స్పల్పంగా కొనసాగుతోంది. జలాశయం నీటిమట్టం 215.80 టీఎంసీలు కాగా.. శనివారం సాయంత్రం నాటికి 167.4860 టీఎంసీలుగా నమోదైంది. 885 అడుగుల నీటి మట్టానికి గా ను 875.80 అడుగులుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 16.998 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. శనివారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 82.131 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 66.140 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో మొత్తం 148.271 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు వివరించారు.


