కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూల్ కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి.. హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 317 మంది ఉండగా, గురువారం 229 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించారు. గైర్హాజరైన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వందశాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వప్నను ఆదేశించారు. తరచూ గైర్హాజరవుతున్న వారితో కారణాలు తెలుసుకోవాలని, అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించారు. ఆరోగ్య సమస్యల కారణంగా దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థినులు నిరంతరం పాఠశాలకు హాజరైతేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పాఠశాలలో అవసరమైన చిన్నపాటి మరమ్మతు కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించరాదని డీఈఓ రమేష్‌కుమార్‌కు సూచించారు. అలాగే ఇంటర్ విద్యార్థినుల కోసం నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించి.. త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ కుర్మయ్య, ఇన్‌చార్జి జీసీడీఓ నిర్మల తదితరులున్నారు.


