కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలంలో తర్నికల్ నుంచి శ్రీరాంనగర్ వరకు రూ. 3.20కోట్లతో నిర్మించే బీటీరోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తర్నికల్, తురకలపల్లి, పంజాగుల గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. పంజాగులలో రూ. 30లక్షలతో ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గంలో రూ. వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు బీటీరోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, ఆనంద్ కుమార్, జిల్లెల రాములు, సంజీవ్ యాదవ్, సురేందర్ రెడ్డి, బాల్‌రెడ్డి, పసుల రమాకాంత్‌రెడ్డి, శ్రీపురం హరీశ్‌రెడ్డి, విజయభాస్కర్, ఆంజనేయులు యాదవ్, వరలక్ష్మి, పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీలత, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


