మహిళల రక్షణ కోసమే షీటీంలు | - | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణ కోసమే షీటీంలు

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

అచ్చంపేట రూరల్‌: మహిళలు, బాలికల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండలంలోని ఐనోలు గిరిజన బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలను ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే డయల్‌ 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. షీ టీం బృందం సత్వరం స్పందించి బాధితులకు అండగా నిలిచి.. పోకిరీల భరతం పడతారన్నారు. బాలికలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని.. సోషల్‌ మీడియాలో వచ్చే అసభ్యకరమైన లింకులను లేదా అనవసరమైన వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. అదే విధంగా మానవ అక్రమ రవాణా చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, సీసీఎస్‌ సీఐ శంకర్‌, షీ టీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి, సిద్ధాపూర్‌ ఎస్‌ఐ అంజయ్య, షీ టీం బృందం వెంకటయ్య, మల్లేష్‌, వెంకట్‌నాయక్‌, జానకీరాములు పాల్గొన్నారు.

సర్‌ ప్రక్రియ వేగవంతం

కందనూలు: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 910 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్‌ కాని ఓటర్లు 13,216 మంది ఉన్నారన్నారు. అదే విధంగా పేర్లు, తల్లిదండ్రుల పేర్లు తదితర వివరాల్లో తేడాలు ఉన్న అనామలిస్‌ జాబితాలో 1,02,635 మంది ఉన్నారని వివరించారు. వీసీ అనంతరం ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశమై.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమీక్షించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మ్యాపింగ్‌ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఓటర్ల వివరాల్లోని వ్యత్యాసాల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై, పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య ఉన్నారు.

ఆరుతడి పంటలకు

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

విద్యుత్‌ శాఖ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌

భూత్పూర్‌: రాష్ట్రంలో ఆరుతడి పంటల సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని, కాబట్టి రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించి ఆయా పంటలు, కూరగాయల తోటలు సాగు చేయాలని విద్యుత్‌ శాఖ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం మండలంలోని శేరిపల్లి (హెచ్‌) గ్రామంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ రైతులు, సర్పంచులకు ఆరుతడి పంటల సాగు, పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలం, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు పంటల సాగుపై ముందుకు వెళ్లాలని, రైతులు వ్యవసాయమే కాకుండా గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, మునుగ తోటల సాగు వైపు దృష్టి సారించాలని, ఎకరా పొలంలో నాలుగు రకాల పంటలు సాగుచేయాలని సూచించారు. మునుగ సాగులో మునగ ఆకు పొడి కిలో దాదాపు రూ.వెయ్యి ఉంటుందని, హైదరాబాద్‌ వంటి నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లో పండే ఆహార పంటలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఆరుతడి పంటలే రైతును రాజుగా చేస్తాయని వివరించారు.

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులను ఆదేశించారు. భూత్పూర్‌లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన కలెక్టర్‌ కుష్బూ గుప్తాతో కలిసి తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement