ఉప్పునుంతల/తెలకపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సత్ఫలితాలు వస్తున్నాయని.. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 620 ఎఫ్‌పీఓల ద్వారా రూ. 5వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.సురేంద్ర మోహన్ అన్నారు. ఉప్పునుంతల పీఏసీఎస్ ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో రూ. 2.50కోట్లతో ఏర్పాటుచేసిన వేరుశనగ డికార్డికేటర్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. ఎఫ్‌పీఓల ద్వారా వచ్చే రెండేళ్లలో రూ. 10వేల కోట్ల టర్నోవర్‌కు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న చిన్నా, సన్నకారు రైతులు పండించిన పంటను నేరుగా అమ్ముకుంటే తక్కువ లాభం వస్తుందని.. అదే రైతులు ఎఫ్‌పీఓల ద్వారా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటుచేసుకొని పండించిన పంటను గ్రాండింగ్, క్రాసింగ్, వాల్యూ ఆడిషన్ చేసి విక్రయిస్తే అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎఫ్‌పీఓల ద్వారా వచ్చే లాభాన్ని షేర్ హోల్డర్లుగా ఉండే రైతులకే చెందుతుందన్నారు. రాష్ట్రంలో 311 పీఏసీఎస్‌లను ఎఫ్‌పీఓలకు ఎంపికం చేయగా.. ఉప్పునుంతల పీఏసీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండటం అభినందనీయమన్నారు. ఈ ఎఫ్‌పీఓలో సుమారు 1500 మంది రైతులు సభ్యులుగా ఉండగా.. ఏడాది వ్యవధిలోనే మంచి ప్రగతిని సాధించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటగా వేరుశనగ డికార్డికేటర్ ప్రారంభించినట్లు వివరించారు. పీఏసీఎస్ పాలక వర్గం, రైతుల కోరిక మేరకు రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారితో మాట్లాడి బ్రీడర్ సీడ్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోల్డ్ ఆయిల్ మిల్లును సురేంద్ర మోహన్ పరిశీలించారు. నూనె తయారీ యంత్రాల పనితీరు, నాణ్యతా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం జమిస్తాపూర్‌లో రైతు మన్నెపురెడ్డి 25 ఎకరాల్లో సాగుచేసిన అయిల్‌పామ్ తోటను పరిశీలించారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్లు మడ్డు నరేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ సీహెచ్ శ్రీనివాసులు, డీసీఓ రఘునాథరావు, జిల్లా కోఆపరేటివ్ సూపరింటెండెంట్ మధు, సీనియర్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తంరావు, డీఏఓ ఎం.చంద్రశేఖర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మధు, ఏఓ రమేశ్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సీఈఓలు రవీందర్‌రావు, రాజవర్ధన్‌రెడ్డి, ధర్మవీర్, రైతు సంఘం ప్రతినిధి కట్టా అనంతరెడ్డి ఉన్నారు.


