నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్: సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సాగించిన పోరాటాన్ని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో నెలకొన్న అసమానతలు, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు లభించేలా ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
● మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి శివారులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వేనం. 119లో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి.. ప్లాంట్ ఏర్పాటుకు ఆ స్థలం ఎంత వరకు అనుకూలంగా ఉంటుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని ఆధికారులకు సూచించారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరు సమకూరుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, స్థల ఎంపిక, మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్రసారం తదితర అంశాలపై పూర్తి వివరాలతో ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ భన్సీలాల్, ఎంపీడీఓ వెంకట్రావు ఉన్నారు.


