కందనూలు: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడితే పరువునష్టం దావా వేస్తారా అని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాలులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటోందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై రాహుల్‌గాంధీ వాస్తవాలను మాట్లాడుతుంటే.. ఎదుర్కోలేక ఆయనపై పరువునష్టం దావా వేయడం విచారకరమని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్న బీజేపీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్ చైర్‌పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజుకుమార్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి ఉన్నారు.


