కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలోని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రను నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేయాలని కుట్రతో హైకోర్టులో ఒక న్యాయవాది వేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడతామని వెంటనే షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు.. 420 హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చి నయవంచనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం విస్మరించి పాలన సాగిస్తే ప్రజలు సహించరని, ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు విజయ్‌గౌడ్, సూర్యప్రకాశ్‌రావు, కృష్ణారెడ్డి, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడతాం..
పెంట్లవెల్లి: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొడతామని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. పెంట్లవెల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెంట్లవెల్లి మండల ప్రజలు ఓట్లు వేయలేదనే కక్ష్యతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ చిట్టెమ్మ, నాయకులు రాజేష్, సరిత, రాజు, పరశురాముడు, ప్రమోద్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


