కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 36 అర్జీలు స్వీకరించారు. వీటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో తొలిరోజు నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో మొత్తం 103 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 13..
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రయేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి ఏఎస్పీ 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూమికి సంబంధించినవి, 5 తగు న్యాయం కోసం, 1 భార్యాభర్తల గొడవకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని, వీటి పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఏఎస్పీ చెప్పారు.
వైభవంగా వెంకన్న
శోభాయాత్ర
కందనూలు: పవిత్ర గరుడ పంచమిని పురస్కరించుకొని వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి, అలివేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు ప్రసాదస్వామి తెలిపారు. కారుకొండతండా ఆర్‌ఆర్‌కాలనీ గ్రామ సర్పంచ్ ముడావత్ గోపాల్‌నాయక్ దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు దేవాలయం నుంచి ప్రారంభమై కారుకొండ కాలనీ వీధులగుండా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో నవోదయ ప్రాంగణం వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సుధారాణి పాల్గొన్నారు.


