ఉప్పునుంతల: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఉప్పునుంతలలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన వేరుశనగ డికార్డికేటర్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు అన్నిరకాల సేవలు అందిస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. మున్ముందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పామాయిల్, కూరగాయలు, పండ్ల తోటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మిల్క్ చిల్లింగ్ సెంటర్‌కు కావాల్సిన స్థలాన్ని సమకూర్చడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. రైతులు సహకారం సంఘం సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, టీజీసీయూ ఎండీ అన్నపూర్ణ, కోఆపరేటివ్ యూనియన్ జాయింట్ రిజిస్ట్రార్ పరిమళ, డీసీఓ రఘునాథరావు, సూపరింటెండెంట్ మధు, డీసీసీబీ డీజీఎం కృష్ణప్రసాద్, డీసీసీబీ అచ్చంపేట బీఎం సాహెదాబేగం, పీఏసీఎస్ సీఈఓ రవీందర్‌రావు పాల్గొన్నారు.


