● నేడు ముసాయిదా
ఓటరు జాబితా ప్రకటన
● జిల్లాలో 1,65,607 మంది
ఓటర్లకు నోటీసులు
● వివరాలు సేకరించే పనిలో బీఎల్వోలు
● ఈఆర్వోల ద్వారా ఆన్ మ్యాఫ్డ్
ఓటర్ల వివరాలపై విచారణ
అచ్చంపేట: సర్ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తిచేసిన యంత్రాంగం.. సోమవారం ఓటరు ముసాయిదా జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9,76,987 మంది ఓటర్లు ఉండగా, బీఎల్‌ఓలు 8,35,484 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఫారాలు ఇవ్వలేకపోయిన 1,41,503 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించనున్నారు. ఓటరు వివరాల్లో తేడాలు(అనామలిస్) కలిగిన వారితో పాటు ఆన్‌మ్యాఫ్డ్ ఓటర్లకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు విచారణకు పిలువనున్నారు. సుమారు 8.35లక్షల మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. వీరిలో సుమారు 1.65లక్షల మందికి పైగా ఓటర్లు నోటీసులు అందుకోనున్నారు. అయితే అర్హులై ఉండి, ముసాయిదా జాబితాలో పేర్లులేని వారికి మరో అవకాశం కల్పించనున్నారు.
అనుమానాస్పద ఓట్లపై విచారణ..
సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనుమానాస్పద, వివరాలు తప్పుగా ఉన్న, ఇంటిపేరు, అక్షర దోషాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్లకు నోటీసులు అందజేసే ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు బూత్‌స్థాయి అధికారుల ద్వారా నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వారీగా నోటీసులు అందించి.. అర్హత నిరూపించుకోవడానికి ఇచ్చిన గడువు, విచారణకు హాజరు కావాల్సిన తేదీలతో కూడిన పత్రాలను పంపిణీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న ఓటరు గరిష్టంగా 15 రోజుల వ్యవఽధిలో ఈఆర్వో ఎదుట విచారణకు హాజరవ్వాలి. ఎన్నికల సంఘం తెలిపిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి చూపాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, వయసులో వ్యత్యాసాలు, ఇతర వివరాల్లో లోపాలు వంటి మొత్తం తొమ్మిది రకాల సమస్యలు ఉన్న సుమారు 1,65,607 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వీడియో కాల్‌లో కూడా పరిశీలన..
ఒక గ్రామం, పట్టణంలో ఎక్కువ మంది నోటీసులు అందుకున్న ఓటర్లు ఉంటే.. వారి వద్దకే ఈఆర్వో, ఏఈఆర్వోలు వెళ్లి విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దూర ప్రాంతంలో ఉన్నవారు, హాజరు కాలేకపోతున్నవారు ఉంటే, వారిని డిజిటల్ విధానంలో విచారించే అవకాశం కల్పించింది. వీడియో కాల్ ద్వారా మాట్లాడి, పత్రాలను ఆన్‌లైన్‌లో తనఖీ చేయనున్నారు. అర్హులైన వారి ఓటు హక్కు కొనసాగించనున్నారు.
జిల్లాలో ఓటర్ల వివరాలిలా..
నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ గల్లంతైన వారు వివరాల్లో తేడాలు
నాగర్‌కర్నూల్ 2,40,571 2,02,407 38,164 38,358
అచ్చంపేట 2,48,362 2,08,589 39,773 36,170
కొల్లాపూర్ 2,42,699 2,07,598 35,101 28,162
కల్వకుర్తి 2,45,355 2,16,890 28,465 62,917


