తగ్గనున్న భారం..
● ప్రతి సోమవారం ఎంపీడీఓ
కార్యాలయాల్లో నిర్వహణ
● వినతుల స్వీకరణకు
ప్రత్యేక డెస్క్ ఏర్పాటు
● అన్నిశాఖల అధికారులు
హాజరయ్యేలా చర్యలు
● వేగవంతంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
అచ్చంపేట/కల్వకుర్తిటౌన్: ప్రజా సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ ప్రజావాణి ప్రారంభించగా.. తాజాగా మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కేంద్రాల్లోనే వినతులు స్వీకరించడం ద్వారా ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు సమయం, ఖర్చు ఆదా కానుంది.
నోడల్ అధికారిగా ఎంపీడీఓ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఆయా మండలాల్లో విధులు నిర్వర్తించే తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, అటవీ, గృహనిర్మాణ, నీటిపారుదల, ఉద్యానవన, మండల పంచాయతీ అధికారులు, ఐసీడీఎస్, ఎకై ్సజ్, పోలీస్ వంటి ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది.
పకడ్బందీగా నిర్వహణ..
నోడల్ అధికారి పర్యవేక్షణలో ప్రజావాణి నిర్వహణ పకడ్బందీగా జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లతో పాటు హెల్స్‌డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్, వైద్య శిబిరంతో పాటు ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, పిల్లలతో ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
అన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు..
జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు, 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసి.. ఫిర్యాదుదారుడికి ఐడీతో కూడిన రశీదు ఇస్తారు. కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాల్సి ఉంటుంది.
జిల్లాలోని పలు మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గిరిజనులు దూర ప్రాంతాల నుంచి రాలేక మన్ననూర్ ఐడీటీఏ కార్యాలయంలో వినతులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు, రేషన్, భూ సమస్యలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలపై వినతులు ఇవ్వడానికి మండల ప్రజావాణి ఒక వేదికగా ఉపయోగపడనుంది. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రత్యేక ఐడీ ఇవ్వనున్నారు. అలాగే గడువులోగా పరిష్కారించడం, పర్యవేక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. అయితే స్థానికంగా మండల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది.


