పాలమూరుపై పీఠ‘ముడి’!
చివరలో తెరపైకి కొత్త పేరు..
క్యాంప్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే ముందు నియోజకవర్గ ముఖ్యనేత మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిందని.. తన చేతిలో ఏమీ లేదని.. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆ ముఖ్యనేత వర్గంలో నిరాశ అలుముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు డిప్యూటీ చైర్మన్‌గా 11వ డివిజన్ నుంచి గెలుపొందిన ఎం.సురేందర్‌రెడ్డి ఖాయమై నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. ఈ పదవిని మైనార్టీ ముస్లిం వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ హైదరాబాద్‌కు మారగా కాగా.. సోమవారం ప్రమాణ స్వీకార సమయంలోనే మేయర్ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం రెండడుగుల దూరంలో ఉన్నా.. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో హస్తానికి పీఠం దక్కేది ఖాయమైంది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. తొలి పదవిని ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ పదవిపై 49వ డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న ఆనంద్ గౌడ్‌తో పాటు ఎన్పీ వెంకటేష్ కూతురు ఎన్పీ నేహా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న నేహా, స్వప్న ఓటమి పాలు కావడంతో ప్రసన్నకే పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులతో నేతలు చీరాల, విజయవాడ క్యాంప్‌నకు తరలివెళ్లారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ఆదివారం క్యాంప్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు పాలమూరులో హీట్ తెప్పించాయి.
ఆదివారం అలజడి..
క్యాంప్‌లో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులతో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ పదవికి ఎవరైతే బాగుంటుంది.. మీరు ఎవరిని కోరుకుంటున్నారంటూ కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిని ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించుకుని అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతతో పాటు ఆయన వర్గం కాంగ్రెస్ నాయకుడైన మైనార్టీవర్గానికి చెందిన సిరాజ్‌ఖాద్రీ భార్య 39వ డివిజన్‌లో గెలుపొందిన హజీరాబేగం పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ అనంతరం అందరూ ఆ మైనార్టీ నాయకుడి భార్యనే ప్రతిపాదించారంటూ రాష్ట్రస్థాయిలో పెద్ద నేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం ఒయటకు పొక్కడంతో క్యాంప్‌లో అలజడి చెలరేగినట్లు సమాచారం.
ముందు రోజే ప్రతిపాదన.. చీలిన నేతలు
సిరాజ్‌ఖాద్రీ భార్యకు మేయర్ పదవి అంశాన్ని జిల్లాలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ నాయకుడు, ఓ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మైనార్టీ నేత వద్ద నియోజకవర్గ ముఖ్యనేత, ఆయన వర్గం శనివారమే ప్రస్తావించినట్లు సమాచారం. ఇరువురు నాయకుల మధ్య సంభాషణ కొనసాగుతుండగానే ఒకానొక దశలో మేయర్ పదవికి 40వ డివిజన్ నుంచి తొలిసారిగా కార్పొరేటర్‌గా ఎన్నికై న సీబీ పూజిత పేరు సైతం వచ్చినట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చిన వారు.. తొలి కార్పొరేషన్‌లో పట్టు ఉన్న వ్యక్తికే పదవి ఇస్తే బాగుంటుందని.. అనుభవం చాలా ముఖ్యమని.. తొలిసారే కార్పొరేటర్‌గా గెలిచిన వారికి ఇవ్వడం సరికాదని వారించినట్లు తెలిసింది. అయినా ముఖ్యనేత వర్గం పట్టు వీడకపోవడంతో అదే రోజు రాత్రి మహబూబ్‌నగర్‌కు పయనమైనట్లు సమాచారం.
హైదరాబాద్, ఢిల్లీ టు మంత్రులు
మేయర్ పదవిపై చోటుచేసుకున్న రాజకీయాలు పార్టీ నేతల మధ్య చీలికకు కారణం కాగా.. తొలుత హైదరాబాద్‌లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు పెద్దల వద్దకు చేరినట్లు తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీకి చేరగా.. సమష్టి నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మేయర్ పదవి ఎంపిక బాధ్యతను ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సంహికు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆదివారం సాయంత్రం చీరాల క్యాంప్ నుంచి కార్పొరేటర్లతో కలిసి నేతలు హైదరాబాద్‌కు బయల్దేరారు. అదేవిధంగా అర్ధంతరంగా క్యాంప్ నుంచి తిరిగి మహబూబ్‌నగర్‌కు చేరుకున్న నేతలు సైతం పట్నం బాట పట్టారు. సోమవారం ప్రమాణ స్వీకార సమయం వరకు వీరందరూ మహబూబ్‌నగర్‌కు చేరుకోనున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్..
రంగంలోకి కీలక నేతలు
మేయర్ పీఠంపై క్యాంప్‌లో చోటుచేసుకున్న రాజకీయాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నగరంలో ఆయా సామాజిక వర్గాల మధ్య చాటింగ్‌ల యుద్ధం కొనసాగింది. పలు సంఘాల నేతలు ముఖ్యనేత, ఆయన వర్గం తీరును దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఈ లొల్లి హైదరాబాద్, ఢిల్లీలోని పార్టీ పెద్దల వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో కొందరు కీలక నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
నియోజకవర్గ నేత, ఆయన వర్గం
ప్రతిపాదన?
విభేదించిన పలువురు నాయకులు.. పార్టీలో చీలిక
నగరంలో వైరల్‌గా మారిన క్యాంప్ రాజకీయాలు
రంగంలోకి ‘పెద్ద’ నేతలు.. మంత్రులకు బాధ్యతలు
ప్రమాణ స్వీకార సమయంలోనే తేలనున్న మేయర్ అభ్యర్థిత్వం


