సాంకేతిక అభివృద్ధికి సైన్సే కారణం
అచ్చంపేట రూరల్: ప్రస్తుత సమాజంలో మానవ మనుగడ, ప్రగతికి సైన్సే మూలమని.. సైన్స్ లేనిది జీవితం లేదని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ జాతీయ కార్యదర్శి ఆశా మిశ్రా అన్నారు. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం దాసరి నరేందర్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర 5వ వార్షిక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాసీ్త్రయ ఆలోచనా విధానంతోనే సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్పొరేట్ శక్తులు సాంకేతికతను వినియోగించుకుంటూ పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు చేపడుతూ.. మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తెస్తున్నాయని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. మేధావుల జ్ఞానాన్ని ప్రజలకు పంచి చైతన్యవంతం చేసేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్లాస్టిక్ వినియోగం అధికమైందన్నారు. ఫలితంగా కష్టపడి సంపాదించిన సొమ్ములో 20శాతం వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వలంటీర్లు కనుమరుగవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని కోరారు. మూఢ నమ్మకాల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు బీఎన్ రెడ్డి, రామచంద్రయ్య, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, రామకృష్ణ, బలరాం, గోపా ల్, దశరథం బాబురావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.


