పట్టాభిషేకానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పట్టాభిషేకానికి సిద్ధం

Feb 16 2026 8:40 AM | Updated on Feb 16 2026 8:40 AM

పట్టాభిషేకానికి సిద్ధం

పట్టాభిషేకానికి సిద్ధం

బలం ఉన్నా చేరికలపై దృష్టి..

కౌన్సిల్‌ సమావేశంలోనే ప్రకటన..

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

నాగర్‌కర్నూల్‌ పుర చైర్మన్‌గా

సునేంద్ర పేరు ఖరారు

కల్వకుర్తి చైర్‌పర్సన్‌గా రత్నమాల.. వైస్‌చైర్మన్‌ విషయంలో అధికార పార్టీలో వర్గపోరు

కొల్లాపూర్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై వీడని ఉత్కంఠ

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాగర్‌కర్నూల్‌తో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్‌ బల్దియాల్లో చైర్మన్‌ ఎన్నికతో పాటు కౌన్సిల్‌ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాలను సోమవారం నిర్వహించనున్నారు. చైర్మన్‌ ఎన్నికకు ఆర్డీఓలు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనుండగా.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాలను హస్తం పార్టీనే దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపులకు తరలిన కాంగ్రెస్‌ అభ్యర్థులు.. అక్కడి నుంచి నేరుగా చైర్మన్‌ ఎన్నిక సమావేశానికి హాజరుకానున్నారు.

కల్వకుర్తిలో వైస్‌చైర్మన్‌ కోసం పంచాయితీ..

కల్వకుర్తి బల్దియాల్లో చైర్మన్‌ పదవిని ముందుగానే ఖరారు చేసినప్పటికీ.. వైస్‌ చైర్మన్‌ విషయంలో నేతల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య నేతల మధ్య నెలకొన్న వర్గపోరు బయటపడుతోంది. మొదటి నుంచి వైస్‌చైర్మన్‌ రేసులో షానవాజ్‌ పేరు వినిపించింది. ఈ విషయంపై చివరి క్షణంలో పార్టీలో పంచాయితీ నెలకొంది. చైర్మన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు కాగా.. చైర్మన్‌ పదవి బీసీ వర్గానికి కేటాయించారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌ పదవిని ఓసీలకు కేటాయించాలని పార్టీలోని మరో వర్గం పట్టుపడుతోంది. వైస్‌చైర్మన్‌ కోసం షానవాజ్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమాకాంత్‌రెడ్డి తల్లి పసుల లలిత పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి స్థానాలు లభించాయి. నాగర్‌కర్నూల్‌లో మొత్తం 24 స్థానాలకు గాను 18 స్థానాలు, కొల్లాపూర్‌లో 19 స్థానాలకు గాను 16, కల్వకుర్తిలో మొత్తం 22 స్థానాలకుగాను 13 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. చైర్మన్‌ ఎన్నికలకు అవసరమైన బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ చేరికలపై దృష్టిపెట్టింది. కల్వకుర్తిలో 8వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన కోడెల లలిత యాదవ్‌ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు.

జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా రత్నమాల పేరును ఇప్పటికే ప్రకటించారు. కొల్లాపూర్‌తో పాటు నాగర్‌కర్నూల్‌ పురపాలిక చైర్మన్లు ఎవరనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్‌ నెలకొంది. సోమవారం చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్‌ సమావేశంలోనే వారి పేర్లను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్‌లో చైర్మన్‌గా తీగల సునేంద్ర, వైస్‌చైర్మన్‌గా బాదం రమేశ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొల్లాపూర్‌లో చైర్మన్‌ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రధానంగా వంగ అనూష రాజశేఖర్‌గౌడ్‌, శ్రీదేవి గౌతమ్‌గౌడ్‌, మేకల రమ్యకుమారి చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి చైర్మన్‌గా అవకాశం దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వైస్‌ చైర్మన్‌ పదవికి సైతం ఇక్కడ తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. కొల్లాపూర్‌లో 14వ వార్డు నుంచి గెలిచిన నరసింహారావుతో పాటు రహీమ్‌పాషా వైస్‌చైర్మన్‌ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా అదృష్టం ఎవరికి వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement