భ్రూణహత్యల కలకలం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో రోజురోజుకూ ఆడపిల్లల నిష్పత్తి మగపిల్లలతో పోలిస్తే తక్కువగా మారుతుండటం భయాందోళన కలిగిస్తుంది. ప్రతిఒక్కరు ఆడపిల్లలు వద్దనుకుంటుండటమే ఆడపిల్లల నిష్పత్తి తగ్గేందుకు కారణమని తెలుస్తుంది. అయితే ఆడపిల్లల నిష్పత్తి పెంచేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో గర్భం దాల్చిన వారిలో చాలామంది మగపిల్లలు కావాలనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదిస్తుండటంతో కాసులకు కక్కుర్తి పడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు భ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జిల్లాకేంద్రంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఓ ఆర్‌ఎంపీ క్లినిక్ నిర్వహిస్తూ ఆబార్షన్లు చేస్తుండగా ఓ మహిళకు అధిక రక్తస్రావమై వికటించడంతో వెలుగులోకి రావడమే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనేది నిదర్శమని చెప్పవచ్చు. భ్రూణ హత్యలు జరగకుండా చూడాలని జిల్లా వైద్యాధికారులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులకు కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెచ్చరికలు సైతం జారీ చేశారు.
ప్రత్యేక బృందం తనిఖీలు
జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలను అరికట్టడం కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ రికార్డులు పరిశీలిస్తున్నారు. ప్రైవేటు వైద్యులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకు లు, ఆర్‌ఎంపీలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినా.. భ్రూణ హత్యలకు పాల్పడినా సెల్ నం.85008 79 884కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
జిల్లాలో గడిచిన మూడేళ్లలో శిశువుల జననాలు ఇలా..
ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు
జిల్లాలో భారీగా తగ్గుతున్న ఆడపిల్లల నిష్పత్తి
తూతూమంత్రంగా వైద్యాధికారుల తనిఖీలు
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడని వైనం
కఠిన చర్యలు తీసుకుంటాం..
జిల్లాలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా.. భ్రూణ హత్యలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. పలు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై వస్తున్న ఆరోపణలు రుజువైతే సీజ్ చేస్తాం. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. అందరూ నిబంధనలు పాటించాలి. – రవికుమార్,
ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ


