రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి
కందనూలు: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి బాలు అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బస్సు డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏకాగ్రత డ్రైవింగ్‌తో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ యాదయ్య, భూపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాజేశ్, తిరుపతయ్య పాల్గొన్నారు.
సీఎం స్పందించే వరకు పోరాటం
చారకొండ: గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి.. ముంపు ముప్పు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమకు న్యాయం చేయాలని నెల రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తూ.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో నిర్వాసితులు ప్రకాశ్, పెద్దయ్యగౌడ్, నాగయ్యనాయక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు
తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్‌లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్‌బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు.
రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి


