సమాజ రక్షణే ప్రధాన లక్ష్యం
నాగర్‌కర్నూల్ క్రైం: సమాజ రక్షణే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేక్ కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ.. ఒకరికొకరు గౌరవించుకోవడం, సహకరించుకోవడం వల్ల ఆనందపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. కొత్త సంవత్సరంలో శాంతియుత సమాజ ఏర్పాటు కోసం జిల్లా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. పోలీసు సిబ్బంది నూతనోత్సాహంతో పనిచేయాలని సూచించారు.
● పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో రోడు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉత్తమ ప్రతిభకనబర్చిన హోంగార్డులు ఆశీర్వాదం, లక్ష్మయ్య, పషియొద్దీన్, నరేందర్ కుమార్, దేవుడు, చంద్రశేఖర్‌ను ఎస్పీ అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
సిబ్బందికి అండగా ఉంటాం..
పోలీసు సిబ్బందికి అండగా ఉంటామని.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని ఎస్పీ సూచించారు. గత అక్టోబర్‌లో హోంగార్డు వెంకటస్వామి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అతడి కుటుంబ సభ్యులకు ఎస్పీ రూ. 20వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమాల్లో అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బుర్రి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆర్‌ఐ రాఘవరావు, జగన్, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, హోంగార్డుల ఇన్‌చార్జి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


