నూతనోత్సాహంతో స్వాగతం
● ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
● ఇళ్ల ముంగిట
రంగురంగుల రంగవల్లులు
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కందనూలు: కొత్త ఆశలు.. ఆశయాలతో జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి దాటాక నూతనోత్సాహంతో కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. యువత ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. గురువారం ఉదయం మహిళలు, యువతులు ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు. నూతన సంవత్సరంలో తమకు మంచి జరగాలని కాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం, సోమశిల సోమేశ్వరాలయం, మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి, శిరసనవాడ సీతారామచంద్రస్వామి ఆలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని రామస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గోవింద క్షేత్రం భక్తులతో కిక్కిరిశాయి. ఆలయాల్లో విశేష పూజలు, ఆరాధనలు, అభిషేకాలు చేశారు.
నూతనోత్సాహంతో స్వాగతం


