జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం
● నూతన సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: జిల్లా అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సమర్థవంతులైన, బాధ్యత గల అధికారులు, సిబ్బంది ఉండటంతోనే గతేడాది పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలులో జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. కొత్త సంవత్సరంలోనూ ఇదే ఒరవడిని కొనసాగించి.. జిల్లా మరింత ప్రగతి సాధించేందుకు నూతనోత్సాహంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేసుకొని ప్రణాళికా బద్ధంగా మందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని.. జిల్లా యంత్రాంగం తరఫున ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం టీజీఓ, తహసీల్దార్ల సంఘం డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్ కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
● జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. తద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. జిల్లాలో ఫిట్‌నెస్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆర్టీఓ బాలును కలెక్టర్ ఆదేశించారు.


