ముఖ్యమంత్రివి డైవర్షన్‌, కరెప్షన్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రివి డైవర్షన్‌, కరెప్షన్‌ పాలిటిక్స్‌

Dec 28 2025 12:53 PM | Updated on Dec 28 2025 12:53 PM

ముఖ్యమంత్రివి డైవర్షన్‌, కరెప్షన్‌ పాలిటిక్స్‌

ముఖ్యమంత్రివి డైవర్షన్‌, కరెప్షన్‌ పాలిటిక్స్‌

గురువు చంద్రబాబు కోసమే ‘పాలమూరు’ను పక్కనపెట్టిన రేవంత్‌

కాళేశ్వరంలా పరుగులు పెట్టించి ఉంటే ఫలితం మరోలా ఉండేది

జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నాగర్‌కర్నూల్‌/నాగర్‌కర్నూల్‌ క్రైం/బిజినేపల్లి/కొల్లాపూర్‌ రూరల్‌: తనవి ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ పాలిటిక్స్‌ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి డైవర్షన్‌, కరెప్షన్‌ పాలిటిక్స్‌ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రలో చంద్రబాబు, లోకేశ్‌ వరద నీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నామని చెబుతున్నారని.. వరద పేరుతో కొత్తగా కట్టిన వాటికి కూడా నీటిని కేటాయిస్తున్నారని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఉంటే 90 టీఎంసీలపై హక్కు వచ్చేదన్నారు. నల్లమల బిడ్డగా చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు. గురువు చంద్రబాబు కోసం పాలమూరును పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నిర్వాకంతోనే ఇప్పటికీ కేఎల్‌ఐ ప్రాజెక్టులో మూడు మోటార్లే పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం పరుగులు పెట్టినట్టుగా పాలమూరు ఎత్తిపోతల పథకం పరుగులు పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 400 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని.. మరి తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్ట్‌కు నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే దానిపై రూ. 10కోట్లు ఖర్చుచేసి 10 సార్లు సర్వే చేశారని తెలిపారు. 18 ప్యాకేజీల్లో కూడా నారాయణపేట– కొడంగల్‌ అంటూ సీఎం కొత్త స్కీం పెట్టుకున్నారని.. అందుకోసం ఇన్‌టెక్‌ పాయింట్‌ను బీమాలో పెట్టారన్నారు. ఇన్‌టెక్‌ పాయింట్‌ జూరాల వద్ద తీసుకుంటే ఎక్కువ నీటిని తీసుకునే అవకాశం ఉండగా.. అలా చేయడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌ కోసం నీటి సోర్స్‌ను శ్రీశైలం నుంచి ఎందుకు పెట్టుకున్నారో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చెప్పాలన్నారు. ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడం ద్వారా పర్మినెంట్‌గా జలవివాదానికి తెరతీసినట్టేనని అన్నారు. జిల్లాలోని వట్టెం రిజర్వాయర్‌ కింద నల్లమట్టిని తీసుకునేందుకు రైతులతో 900 ఎకరాలు తీసుకున్నారని.. తీరా చెరువుల్లో నల్లమట్టిని తీసుకొచ్చి రిజర్వాయర్‌కు వినియోగిస్తున్నారని తెలిపారు. రైతులతో తీసుకున్న భూములు కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయన్నారు. అవి రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణంలో అసైన్డ్‌ భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. ఇక గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌ పూర్తి చేయించే బాధ్యతను స్థానిక ఎంపీ తీసుకోవాలని కోరారు. జాగృతి పోరాటమంతా సామాజిక తెలంగాణ సాధన కోసమేనని అన్నారు. తాము 80 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇస్తామన్నారు. అంతకుముందు జిల్లా జనరల్‌ ఆస్పత్రి, వట్టెం రిజర్వాయర్‌, కుమ్మెర పంప్‌హౌజ్‌తో పాటు కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలో ఉన్న కేఎల్‌ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాల పంపుహౌజ్‌లను ఆమె పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్‌లో ఎరుకల కాలనీని సందర్శించారు. అక్కడ ఏకలవ్య చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌, వెంకటేశ్‌, వెంకటేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement