జలదోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం
కల్వకుర్తి రూరల్: పేదరికంతో అల్లాడుతున్న పాలమూరు రైతాంగాన్ని పట్టించుకోకుండా నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న జలదోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదామని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు. కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో శనివారం ఎరవ్రెల్లి గ్రామ ముంపుపై అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, నాయకులు బాలాజీ సింగ్, ఎడ్మ సత్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ.. కరువు, పేదరికంతో అల్లాడుతున్న పాలమూరు రైతాంగానికి అండగా నిలిచేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాలమూరు హక్కులు, సాగునీటిపై ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. డిండి – నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే గోకారంలో ముంపునకు గురవుతున్న ఎరవ్రెల్లి గ్రామం, తండాను కాపాడాలన్నారు. నిర్వాసితులంతా ఏకమై పంచాయతీ ఎన్నికలను సైతం బహిష్కరించారని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా రైతుల ప్రయోజనాలు పూర్తిచేశాకే మిగ తా విషయాలు ఆలోచించాలని.. అంతవరకు జల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు తీర్మానించారు. నాయకులు సదానందంగౌడ్, పరశురాములు, దుర్గాప్రసాద్, రాఘవేంద్రగౌడ్, జంగయ్య, సాంబయ్యగౌడ్, విజయ్‌గౌడ్, మల్లయ్య, బాలయ్య, ఎరవ్రెల్లి ప్రకాశ్, శ్రీనివాస్, నాగయ్య నాయక్ ఉన్నారు.


