కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం
కందనూలు: జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో శనివారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ వేడుకను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి – సరిత దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చక స్వాములు శోభాయమానంగా అలంకరించి.. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక జరిపించారు. వందలాది భక్తులు తిలకిస్తుండగా.. జీలకర్ర బెల్లం, మంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కమనీయంగా సాగింది. లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుకను భక్తజనం కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. తెలంగాణలోనే మొదటి సారిగా యాదాద్రి తరహాలో అంత్యంత వైభవంగా జిల్లా కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు.
కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం


