కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్ల ధర్నా
నాగర్‌కర్నూల్ రూరల్: పల్స్‌పోలియో, కుష్టు సర్వే, ఎన్నికల విధుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు మాట్లాడుతూ.. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశావర్కర్లు విధులు నిర్వర్తిస్తే ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించకపోవడం సరికాదన్నారు. పల్స్‌పోలియో, కుష్టు సర్వేకు సంబంధించిన డబ్బులు సైతం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పీహెచ్‌సీల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఆశావర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఆశావర్కర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్దన్ పర్వతాలు, సహాయ కార్యదర్శి పొదిల రామయ్య, మధు, శివరాములు, జయమ్మ, కళావతి, రజిత, శివలిల, యాదమ్మ, స్వప్న, రత్నమాల, శ్రీదేవి, యాదమ్మ, బాలమణి పాల్గొన్నారు.


