కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసు దర్యాప్తును వేగంగా పూర్తిచేసి.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులను విచారణ సమయానికి పూర్తిచేసి, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజా భద్రతకు సంబంధించిన అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా కేసుల నమోదు నుంచి దర్యాప్తు వరకు ప్రతి దశలో పారదర్శకత పాటిస్తూ.. ప్రజల నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పారదర్శక దర్యాప్తుతో నేరస్తులను శిక్షించడమే కాకుండా, నేరస్తులు కాని వారి హక్కులను కాపాడటం పోలీసుల బాధ్యత అని అన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు మహేశ్, అశోక్‌రెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు.


