
పైప్‌లైనే ముద్దు
కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి..
కాల్వ వద్దు..
జిల్దార్‌తిప్ప చెరువుకు నీటి తరలింపుపై రైతుల విజ్ఞప్తి
మా గ్రామాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చాలాసార్లు చెప్పారు. కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. కాల్వలు తవ్వితే ఉన్న కొద్దిపాటి భూములు కోల్పోతాం. కాబట్టి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తే అందరికీ ఉపయోగం.
– గోవిందు, రైతు, మొలచింతలపల్లి
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌లో స్లూయిస్ ఏర్పాటుచేశారు. అక్కడే 318 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌లో పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్‌తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్‌లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ అధికారులకు వివరించాం.
– బండి వెంకట్‌రెడ్డి, గ్రామాభ్యుదయ
సేవాసంస్థ నిర్వాహకుడు, ఎల్లూరు
జీల్దార్‌తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించాం. కానీ కాలువలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్‌లైన్ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వారి ఆదేశాల తర్వాతనే పనులు ప్రారంభిస్తాం.
– అమర్‌సింగ్, డీఈ, నీటిపారుదల శాఖ
కొల్లాపూర్: కృష్ణానది నీటిని జిల్దార్‌తిప్ప చెరువుకు తరలించే పనులు ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు. లక్షల ఎకరాలకు నీరందించే కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులు పక్కనే ఉన్నా మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్‌తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్‌తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రైతులు రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్‌తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు.
జిల్‌దార్‌తిప్ప చెరువే ఆధారం
జీల్దార్‌తిప్ప చెరువును 2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1970లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జలగం వెంగళ్‌రావు శంకుస్థాపన చేయగా.. ఎమ్మెల్యే కే.రంగదాసు నిర్మాణం పూర్తి చేశారు. ఈ చెరువు కింద 13 వందల ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోంది. మొలచింతలపల్లిలోని చింతల్‌చెరువు, పెద్దచెరువు, చిలుకలూటి చెరువు, ముక్కిడి గుండం గ్రామంలోని ఊరచెరువుల కింద మరో 8 వందల ఎకరాల సాగు జరుగుతోంది. రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూముల విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది 3 వేల ఎకరాలకు పైగా చేరుతుంది.
మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్ల వ్యయంతో కృష్ణా బ్యాక్ వాటర్‌పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరోసారి 2019లో కేఎల్‌ఐ నుంచి జీల్‌దార్‌తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించి.. శంకుస్థాపనలు చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే కారణంగా పనులు ముందుకు సాగలేదు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్ల వ్యయంతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది.
మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు అందని సాగునీరు
నీటి తరలింపునకు రెండుసార్లు
శంకుస్థాపనలు
ముందుకు సాగని పనులు
కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టుల
పక్కనే ఉన్నా అలసత్వమే..

పైప్‌లైనే ముద్దు