
ఇంటర్‌లోనూ ఫేస్ రికగ్నేషన్
త్వరలోనే ఏర్పాటు..
నాగర్‌కర్నూల్: విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో వవిద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నేషన్ హాజరు విధానం ప్రవేశపెట్టగా.. ఇదే విధానాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం విద్యార్థులు, అధ్యాపకుల హాజరులో మరింత పారదర్శకత ఉండేలా చూసుకుంటోంది.
16 కళాశాలల్లో..
జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 16 ఉండగా.. అందులో ప్రథమ సంవత్సరంలో 2,389 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,800 మంది కలిపి మొత్తం 4,189 మంది విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో మొత్తం 165 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల బయెమెట్రిక్ ద్వారా హాజరు వేస్తుండగా అక్కడక్కడ నెట్‌వర్క్ సమస్యలు, బ్యాటరీ లోపాలు వంటివి ఎదురవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
ఇప్పటికే సీసీ కెమెరాల నిఘాలో...
కళాశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.22కోట్లు మంజూరు చేయడంతో అన్ని కళాశాల్లో క్లాస్‌రూం, ల్యాబ్, ప్రిన్సిపల్ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయబడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచే అధికారులు తరగతులు, బోధనా పద్ధతులు, విద్యార్థుల, అధ్యాపకులు హాజరు వంటి విషయాలను పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ కళశాలల్లో ఫేస్ రికగ్నేషన్ హాజరుకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఏర్పాటు పూర్తి చేసి ఫేస్ రికగ్నేషన్ హాజరు అమలు కానుంది. దీంతో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుకు సంబంధించి మరింత పారదర్శకత పెరగనుంది.
– వెంకటరమణ,
ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్
ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టేందుకు చర్యలు
విద్యా నాణ్యత పెంపొందించేలా చర్యలు
జిల్లాలో 4,189 మంది విద్యార్థులు

ఇంటర్‌లోనూ ఫేస్ రికగ్నేషన్