
జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరునికి తిలతైలాభిషేకం
బిజినేపల్లి: ఏలినాటి శనిదోష నివారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చెరుకుని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరునికి తిలతైలాభిషేకం, పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులతో శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, ప్రదక్షిణలు, నందీశ్వర దర్శనం, అన్న ప్రసాదం వంటి కార్యక్రమాలు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమా మహేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన తిరుమలనాఽథ వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా, గుట్ట కింద దాతలు అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో గుట్టపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్‌లో ఇరువైపులా వాహనాల రద్దీ ఏర్పడి రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని రాకపోకలను పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు. గుట్టపైన భక్తులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
రేపు గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్
గద్వాల న్యూటౌన్: జిల్లాలోని కేటీదొడ్డి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 5, 6, 7, 8, 9వ తరగతుల్లో (ఇంగ్లీష్ మీడియం) మిగులు సీట్లకు ఈనెల 18వ తేదీ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని తిరుమల హిల్స్ అప్పన్నపల్లి నందు 18న ఉదయం 10గంటలకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని, గిరిజన విద్యార్థినులకు మాత్రమే సీట్లు ఉన్నాయని, ఎస్టీ ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్, పీహెచ్‌సీ క్యాటగిరీలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.