
‘బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి’
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రం నుంచి నాగనూల్ రోడ్డులో వరద నీరు వెళ్లే చోట బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా నాగర్‌కర్నూల్ నుంచి నాగనూల్ వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అక్కడి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరగా నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించి నిర్మిస్తామని అక్కడి ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గుడిపల్లిలో పర్యటన
నాగర్‌కర్నూల్ మండలంలోని గుడిపల్లిలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిశీలించేందుకు పలు కాలనీల్లో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి పర్యటించారు. గుడిపల్లి కాల్వకు లైనింగ్ లేకపోవడం వల్ల ఇళ్లలోకి, కాలనీల్లోకి నీరు ఊరుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాల్వ లైనింగ్ కోసం అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.