
42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిద్దాం
అచ్చంపేట: 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు, నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనాయకులు, కుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 20న అచ్చంపేటలో నిర్వహించే భారీ ర్యాలీలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్ గోపిశెట్టి శివ, బీసీ సంఘాల నాయకులు కాశన్నయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై. శ్రీనివాసులు, శరణ్‌గౌడ్, శారదమ్మ, నిరంజన్, సత్యమ్మ, హరినారాయణగౌడ్, మల్లయ్య ఉన్నారు.