
అంబరాన్నంటిన తీజ్ వేడుకలు
లింగాల: గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుతూ తీజ్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. లింగాల, సూరాపూర్ తదితర గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ వేడుకలను మొలకల పండుగతో ముగించారు. లింగాల బంజారవాడలోని మేరమ్మ భవాని ఆలయం ఆవరణలో గిరిజన యువతులు నిష్టతతో మొలకలను పెంచారు. చివరి రోజు బంజార వేషధారణతో యువతులు మొలకల బుట్టలను తలపై ఉంచుకొని ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. డీజే సౌండ్ మధ్య ఊరేగింపు అనంతరం పట్టణ సమీపంలోని రామాలయం ఎదుట ఉన్న పెద్దకర్ణం కుంటలో నిమజ్జనం చేశారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.
సంప్రదాయానికి ప్రతీక తీజ్
కల్వకుర్తి టౌన్: తీజ్ ఉత్సవాలు లంబాడీల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని భగత్‌సింగ్ తండాలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీజ్ ఉత్సవాలను గిరిజనులు కనులపండువగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలు కొనసొగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, భగత్‌సింగ్ తండావాసులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న యువతుల సంప్రదాయ నృత్యాలు
మొలకలతో భారీ ఊరేగింపు