
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం
కందనూలు: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ, 17వ వార్డులో ఆయన పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 2012లో అప్పటి ప్రభుత్వం బీసీ కాలనీలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో వందలాది కుటుంబాలు స్థిరనివాసం ఏర్పర్చుకొని నివసిస్తున్నాయన్నారు. నాటి నుంచి నేటి వరకు కాలనీ అభివృద్ధిపై పాలకులు దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలనీలో కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఇంటి నంబర్లు లేవని, మిషన్ భగీరథ నీరు రావడం లేదని, కరెంటు కూడా సక్రమంగా ఉండటం లేదన్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా.. వృద్ధులు బయటకు రావాలన్నా సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రం అయినప్పటికీ కాలనీలపై అశ్రద్ధ చేయడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు.