వానొస్తే.. వాగు దాటేదెలా | - | Sakshi
Sakshi News home page

వానొస్తే.. వాగు దాటేదెలా

Aug 18 2025 8:07 AM | Updated on Aug 18 2025 8:07 AM

వానొస్తే.. వాగు దాటేదెలా

వానొస్తే.. వాగు దాటేదెలా

అచ్చంపేట: వానొస్తే వాగులను దాటలేని పరిస్థితి నెలకొంటోంది. ప్రధాన రహదారులపై ఉన్న లోలెవల్‌ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఫలితంగా పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే పాలకులు, అధికారులు.. ఆ తర్వాత వాటి గురించే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని దుందుభీ, చంద్రవాగు, ఇతర వాగులపై లోలెవల్‌ కాజ్‌వేలు, వంతెనలపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది.

ప్రమాదాలు ఇలా..

● ఈ నెల 11న నాగర్‌కర్నూల్‌–నాగనూలు మార్గంలో వరద ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. గతేడాది ఇక్కడే వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్‌ రక్షించారు.

● లింగాల–పద్మన్నపల్లి రహదారిలో చిన్నవాగు వరద ఉధృతికి ఈ నెల 15న లింగాలకు చెందిన ముడావత్‌ పెంట్యానాయక్‌ (65) కొట్టుకుపోయి మృతిచెందాడు.

● మూడేళ్ల క్రితం కోడేరు మండలం పస్పుల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పడి మృతిచెందాడు.

● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి వద్ద వాగులో ఇప్పటికే మూడు ట్రాక్టర్లు, ఒక కారు కొట్టుకుపోయాయి.

● తెలకపల్లి మండలం కార్వంగ–నడిగడ్డ మార్గంలోని వాగులో గతేడాది గొర్రెల కాపరులు వరదలో చిక్కుకుంటే ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ్‌ బృందాలు రంగంలోకి దిగి రక్షించాయి.

నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే..

మొల్గర హైలెవల్‌ వంతెన నిర్మాణానికి 2023 జూలై 24న రూ. 35కోట్లు మంజూరయ్యాయి. 80 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ మేరకు సర్వే చేసి, భూసార పరీక్షలు నిర్వహించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు వంతెన నిర్మాణ డిజైన్‌ చేసి ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి పంపించారు. డిజైన్‌ అప్రూవల్‌ దశలోనే ఉండటంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిషేధిస్తూ పోలీసులు బారికేడ్స్‌ ఏర్పాటుచేశారు.

● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి వద్ద వాగుపై వంతెన నిర్మాణానికి 2021లో రూ. 96లక్షలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.

● కోడేరు మండలం పస్పుల వద్ద వంతెన నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరైనా పనులకు మోక్షం కలగడం లేదు.

● తెలకపల్లి మండలం కార్వంగ–నడిగడ్డ మార్గంలో ఐదేళ్ల క్రితం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది.

● వెల్దండ మండలం సిరసగండ్ల–చారకొండ మార్గంలో మూడేళ్ల క్రితం భైరాపూర్‌ వాగు ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ. 3.50కోట్లు మంజూరయ్యాయి. ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. అలాగే చెర్కూర్‌–గాన్‌గట్టుతండా మార్గంలో వాగుపై వంతెన నిర్మాణానికి రూ. 4.15 కోట్లు మంజూరైనా పనులు చేసేందుకు కంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

● తాడూరు మండలం సిర్సవాడ–మాదారం దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. 300 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఈఏడాది మార్చి 7న రూ. 20.20కోట్లు మంజూరు చేసింది. ఇంత వరకు పనులు మొదలు కాలేదు.

ప్రయాణం నరకప్రాయం..

ఉప్పునుంతల, వంగూరు మండలాల మధ్య దుందుభీ వాగు ప్రవహిస్తోంది. మొల్గర వద్ద వాగు ఉధృతికి ఉప్పనుంతల, మొల్గర మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్‌ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉల్పర, మిట్టసదగోడు, కోనాపూర్‌, రంగాపూర్‌, ఎల్లికల్లు, మొల్గర, జప్తిసదగోడు, పెద్దాపూర్‌, లక్ష్మాపూర్‌, మామిళ్లపల్లి వంటి 10 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

● అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి–చందంపేట రహదారిపై దుందుభీ వాగు ఉధృతి కారణంగా కాజ్‌వే దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐనోలు, బొమ్మనపల్లి, సిద్ధాపూర్‌, మన్నెవారిపల్లి, ఘనపూర్‌, అక్కారం, బక్కాలింగాయిపల్లి ఏజెన్సీ గ్రామాల ప్రజలు 70 కి.మీ. తిరిగి దేవరకొండ, చందంపేటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

● అచ్చంపేట మండలంలోని చంద్రవాగు పొంగితే చౌటపల్లి, బాణాల, బిల్లకల్లు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.

● కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌– ముక్కిడిగుండం మార్గంలో పెద్దవాగు ఉధృతంగా పారుతుండటంతో ముక్కిడిగుండం, గేమ్యానాయక్‌తండా, చెంచుగూడెం, మొలచింతలపల్లి గ్రామాల రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

● అచ్చంపేట–ఉప్పునుంతల రహదారిలో మల్లప్ప

వాగు పారితే జనజీవనం స్తంభిస్తుంది.

● దాసర్లపల్లి, లక్ష్మాపూర్‌ మధ్య చీకటివాగు వరద ఉధృతికి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతాయి.

● ఉప్పునుంతల–పెద్దపూర్‌ వాగుపై వంతెన ఏర్పాటు చేయా లని ఏళ్లుగా కోరుతున్నా ఫలితం లేదు.

● బల్మూర్‌, వీరంరాజుపల్లి రహదారిలోని కల్వర్టు, చెన్నారం, వీరంరాజుపల్లి, రామాజీపల్లి మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కొండనాగుల, అచ్చంపేట మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.

● లింగాల–అంబటిపల్లి రోడ్డులో కేసీతండా గేట్‌ వద్ద వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

● యాపట్ల–అంబట్‌పల్లి మార్గంలో ఉన్న వాగుపై ప్రస్తుతం ఉన్న కాజ్‌వే శిథిలావస్థకు చేరింది.

● వంగూరు–జూపల్లి, గోకారం–తుర్కపల్లి మార్గాల్లో వాగులు దాటనీయడం లేదు.

● కోడేరు–పెద్దకొత్తపల్లి, కోడేరు–పస్పుల, ఖానాపూర్‌–పస్పుల, గంట్రావుపల్లి మార్గాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.

● లింగాల–చెన్నంపల్లి మధ్య పెద్దవాగు వాగు దాటడం ప్రమాదకరంగా మారింది. చెన్నంపల్లి, ఎర్రపెంట, పద్మనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతిపాదనలు

సిద్ధం..

దుందుభీ వాగుపై వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే మొల్గర వద్ద వంతెన ఏర్పాటుకు రూ. 35కోట్లు మంజూరయ్యాయి. సర్వే, భూసార పరీక్షలు పూర్తయాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు వంతెన డిజైన్‌ చేసి ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి పంపించారు. డిజైన్‌ అప్రూవల్‌ దశలో ఉంది. మన్నెవారిపల్లి వద్ద డిండి వాగుపై కూడా వంతెన నిర్మాణం చేపడుతాం. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వంతెనలు అవసరమున్నాయో గుర్తించి మంజూరు చేయించేందుకు కృషి చేస్తా.

– డా.చిక్కడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట

వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్న పల్లె జనం

మొల్గర–కల్వకుర్తి, మన్నెవారిపల్లి–చందంపేట మధ్య బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ

17 గ్రామాలకు రాకపోకలు బంద్‌

ముందుకు సాగని వంతెనల నిర్మాణ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement