ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజవాణిలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 16 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 7 భూ తగాదాలు, 3 భార్యాభర్తల గొడవలు, 6 వివిధ రకాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఫిర్యాదులను ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు సిఫారస్ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
కల్వకుర్తి రూరల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారో ఆ జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద యువతకు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రుణం మంజూరు చేయాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో మూడో మహాసభలు కల్వకుర్తిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్, కేశవులు, వెంకటయ్య, చంద్రమౌళి, ఇందిరా విజయుడు, నర్సింహ, శంకర్‌గౌడ్, డా. శ్రీనివాస్, పులిజాల పరశురాం, బాలమురళి, మధు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఇంట్రా
డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19, 23 విభాగాలకు ఈ సెలక్షన్స్ ఉంటాయన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి రోడ్డులోగల ఎండీసీఏ క్రికెట్ మైదానంలో, జడ్చర్లలోని మినీ స్టేడియంలో, 15న నారాయణపేటలోని మినీ స్టేడియంలో, నాగర్‌కర్నూల్‌లోని నల్లవెల్లి రోడ్డులోగల క్రికెట్ అకాడమీలో, 16న వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీపీఎల్ మున్సిపల్ గ్రౌండ్‌లో, గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఎంపికై న క్రీడా జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్‌లకు శ్రీకారం చుట్టిందని, పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభచాటాలని పిలుపునిచ్చారు. క్రికెట్ సెలక్షన్స్‌కు సంబంధించి మిగతా వివరాల కోసం మహబూబ్‌నగర్‌లో సంతోష్ (81792 75867), నాగర్‌కర్నూల్‌లో సతీష్ (89193 86105), జడ్చర్లలో మహేష్ (99494 84723), గద్వాలలో శ్రీనివాసులు (98859 55633), నారాయణపేటలో రమణ (91007 53683), పెబ్బేర్‌లో శంకర్ (96033 60654) నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
స్పాట్ కౌన్సెలింగ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్‌నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్‌లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్‌లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.


