
ముగిసిన ఎస్‌ఏ–2 పరీక్షలు
కందనూలు: జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–2) పరీక్షలు గురువారం ముగిశాయి. వీరి ప్రతిభను తెలిపే ప్రోగ్రెస్ కార్డుల విధానానికి స్వస్తి పలికి రెండేళ్లుగా విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రగతి పత్రాలను అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వద్ద ఇప్పటికే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక (ఎస్‌ఏ–1) పరీక్ష ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 20లోగా ఎస్‌ఏ–2 పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో ఇది వరకు విద్యార్థులకు నిర్వహించిన నిర్మాణాత్మక (ఎఫ్‌ఏ–1, 2, 3, 4), సంగ్రహణాత్మక (ఎస్‌ఏ–1) మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తయింది. సమ్మేటివ్–2 పరీక్షలు గురువారంతో పూర్తి కావడంతో ఉపాధ్యాయులు జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్నారు. ఫలితాలను ఆదివారంలోగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆన్‌లైన్‌లో కార్డులు డౌన్‌లోడ్ చేసుకుని, బుధవారం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలో ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు.
23న ముగియనున్న
2023– 24
విద్యా సంవత్సరం
ప్రతి విద్యార్థికి అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రగతి పత్రాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని హెచ్‌ఎంలకు సూచించాం. ఈ నెల 23న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డులు అందించాలి.
– రాజశేఖర్‌రావు,
జిల్లా పరీక్షల నిర్వహణాధికారి