నాగర్‌కర్నూల్: ఈ నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రజా సమూహ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో ఎల్‌ఆర్‌ఎస్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు చెల్లించిన ఫీజులో 25 శాతం రాయితీ లభిస్తుందని.. దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


