అనుమానం వస్తే
ఆరోగ్య సిబ్బందికి చెప్పండి..
కుష్టువ్యాధి అనుమానితుల గుర్తింపుపై వైద్యశాఖ దృష్టి
సాక్షి ప్రతినిధి, వరంగల్: కుష్టు కేసులను వెలికి తీసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ)ను అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చర్మంపై అనుమానాస్పద మచ్చలు, స్పర్శజ్ఞానం తగ్గడం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత వంటి లక్షణాలను పరిశీలించనున్నారు. కుష్టు వ్యాధి ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడంతోపాటు శాశ్వత వైకల్యాలను కూడా నివారించవచ్చని వైద్యశాఖ చెబుతోంది. అందుకే అనుమానితులను గుర్తించడం, పరీక్షలు చేయించడం, నిర్ధారణ అయిన వారికి వెంటనే బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) అందించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం.
ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక నజర్..
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబా బాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలతో కూడిన పూర్వ ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని సాధారణ ఆరోగ్య సేవల్లో భాగంగా కొనసాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా అధికారిక ఆరోగ్యశాఖ వెబ్సైట్లోనూ జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం (ఎన్ఎల్ఈపీ)ను ప్రధాన కమ్యూనికబుల్ డిసీజ్ కార్యక్రమాల్లో ఒకటిగా పేర్కొంది. ఆరు జిల్లాల్లోనూ కుష్టు కేసుల ముందస్తు గుర్తింపు, ఇంటింటి కాంటాక్ట్ సర్వే, ఆశ కార్యకర్తల భాగస్వామ్యం, ఉచిత ఎండీటీ చికిత్స, వైకల్య నివారణ చర్యలను ఎన్ఎల్ఈపీలో భాగంగా అమలు చేస్తున్నట్లు వైద్యశాఖ పేర్కొంది.
మచ్చ కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..
చర్మంపై సాధారణ రంగుకంటే తెల్లగా లేదా రాగి రంగులో మచ్చలు కనిపించడం, ఆ ప్రాంతంలో స్పర్శజ్ఞానం తగ్గడం లేదా లేకపోవడం కుష్టు వ్యాధికి ముఖ్యమైన సంకేతాలుగా వైద్యశాఖ పేర్కొంటోంది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత, స్పర్శజ్ఞానం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలి. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో గతేడాది నిర్వహించిన సర్వే వివరాలు
జిల్లా సర్వే చేసిన గృహాలు పరీక్షించుకున్నవారు అనుమానితులు
హనుమకొండ 2,17,815 9,07,815 1406
వరంగల్ 1,86,668 7,46,672 1013
జేఎస్ భూపాలపల్లి 13,386 4,33,506 336
ములుగు 79,216 2,84,530 722
జనగామ 1,26,509 4,59,783 847
మహబూబాబాద్ 2,07,697 7,64,772 2544
8,31,291 35,97,078 6,868
మళ్లీ మొదలైన ఎల్సీడీసీ సర్వే
ఇంటింటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది
తొలిదశలో గుర్తిస్తే వైకల్యానికి చెక్
ఉమ్మడి వరంగల్లో
విస్తృతంగా స్క్రీనింగ్
కుష్టు వ్యాధి శాపం కాదు.. వంశపారంపర్య వ్యాధి కూడా కాదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేకు ప్రజలు సహకరించి, అనుమానాస్పద లక్షణాలుంటే దాచిపెట్టకుండా ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. వ్యాధిపై భయాందోళనలు అవసరం లేదు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా వారికి అండగా నిలుద్దాం.
– డాక్టర్ ఎ.అప్పయ్య,
డీఎంహెచ్ఓ, హనుమకొండ


