మల్హర్: మండలంలోని కొండపేట గ్రామపంచాయతీ పరిధిలోని కుంభంపల్లిలో పంట పొలాల్లో శుక్రవారం కోతులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన ముల్కల రాజేశ్వర్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలోని మోటార్ వైర్లు, స్టార్టర్ బాక్స్‌ను ధ్వంసంచేసి వైర్లను తెంపేశాయి. దీంతో వ్యవసాయ మోటార్ పూర్తిగా కాలిపోయింది. 15 రోజుల క్రితం కోతులు ధ్వంసం చేయడంలో రూ.40 వేలు చెల్లించి మరమ్మతులు చేసినట్లు సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల విధ్వంసంతో రిపేర్లకు మరో రూ.10వేలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. తెగిన వైర్లను గమనించకుండా వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు. కోతుల బెడద నివారించాలని రైతులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.


